Narendra Modi: పీఎం మోడీ ఇలా.. బీజేపీ ఎంపీ ధర్మపురి అలా.. కేసీఆర్ పై అర్వింద్ పాజిటివ్ కామెంట్లు
ప్రధాని మోడీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కలిపి విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే .. బీఆర్ఎస్‌కు కార్బన్ పేపర్‌లా పాలన ఉంటుందని ఆరోపించారు. కానీ, ఇదే రోజు జగిత్యాలలో ధర్మపురి అర్వింద్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కేసీఆర్ పై పాజిటివ్ కామెంట్లు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల క్యాంపెయిన్ ఉధృతంగా సాగుతున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ పార్టీల అధినాయకత్వంలో ప్రచారంలో ఫుల్ బిజీ అయిపోయింది. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని అంటే.. కాంగ్రెస్‌కు సీ టీమ్ అని బీజేపీ ఆరోపణలు సంధిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆర్ఎస్ పై ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి. లిక్కర్ కేసు, ఇతర కొన్ని అంశాల కారణంగా బీజేపీ.. బీఆర్ఎస్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లింది. ఈ అభిప్రాయం అవాస్తవం అని చెప్పడానికి బీఆర్ఎస్, బీజేపీ ముప్పుతిప్పలు పడుతున్నాయి. ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారం భిన్నంగా ఉన్నది. ఆయన రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ.. కేసీఆర్‌పై పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తుక్కుగూడలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. కానీ, జగిత్యాలలో ఓ కార్నర్ మీటింగ్‌లో ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ కేసీఆర్ పై సాఫ్ట్ కామెంట్లు చేశారు. ప్రధాని విమర్శిస్తూ మాట్లాడగా.. బీజేపీ ఎంపీ ధర్మపురి మాత్రం సాఫ్ట్‌గా మాట్లాడటం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై మోడీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ పాలనకు కార్బన్ పేపర్‌లా ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్ ఓటు వేయడమంటే అది బీఆర్ఎస్‌కు వేసినట్టేనని, ఎందుకంటే కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే చేరుతారని ఆరోపించారు.
Also Read : బీజేపీ ‘హంగ్’ ఆశలు? ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?
ప్రధానమంత్రి మోడీ ఈ రెండు పార్టీలను విమర్శించగా.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం ఇందుకు భిన్నంగా కామెంట్లు చేశారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ చాలా బెటర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం పదేళ్లు కొట్లాడాడని అన్నారు. అదే కేసీఆర్ ఉద్యమిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడని, ప్రత్యేక తెలంగాణ సాదన ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేశాడని చెప్పారు. ఇప్పటికీ టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పినట్టే రేవంత్ రెడ్డి నడుచుకుంటాడని తీవ్ర విమర్శలు చేశాడు. అంతేకాదు, టీడీపీపైనా ఆయన విమర్శలు చేయడం గమనార్హం.
అర్వింద్ తన ప్రసంగంలో కేసీఆర్‌ను కూడా విమర్శించారు. కానీ, రేవంత్ రెడ్డిని విమర్శించడానికి కేసీఆర్‌ను మళ్లీ పొగిడారు. ఇలా కేసీఆర్‌ను ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పొగిడారు. అంతేకాదు, వచ్చేది హంగ్ ప్రభుత్వమేనని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.