Bandi Sanjay:కార్పోరేటర్ నుండి కరీంనగర్ ఎంపీ... ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీ జనరల్ సెక్రటరీగా బండి సంజయ్ ప్రస్థానం
కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుండి తప్పించిన తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని పార్టీ నాయకత్వం నియమించింది.
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి (bharatiya janata party) ఓ ఊపు తెచ్చిన నేతగా బండి సంజయ్ కు పేరుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేట్ స్థానాలను దక్కించుకుంది. ఈ పరిణామాలు తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయమనే చర్చకు కూడ కారణమైంది. అయితే అనుహ్యంగా బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించారు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) కి బాధ్యతలను బీజేపీ నాయకత్వం అప్పగించింది.ఈ పరిణామం బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది కల్గించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. సీఎం రేసులో బండి సంజయ్ పేరు కూడ ప్రధానంగా విన్పిస్తుంది. 1971 జూలై 11న కరీంనగర్ లో బండి సంజయ్ జన్మించారు.బి.నర్సయ్య, శకుంతల బండి సంజయ్ తల్లిదండ్రులు.బండి సంజయ్ కు భార్య అపర్ణ (aparna). ఇద్దరు కొడుకులున్నారు.భార్య అపర్ణ బ్యాంకు ఉద్యోగి.
కరీంనగర్ (karimnagar ) లోని సరస్వతి శిశుమందిర్ లో బండి సంజయ్ విద్యాభ్యాసం చేశారు.12 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో బండి సంజయ్ చేరారు. విద్యాభ్యాసం చేసే సమయంలో అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ (abvp)లో చేరారు. ఏబీవీపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. పలు రాష్ట్రాల ఏబీవీపీ ఇంచార్జీగా కూడ ఆయన పనిచేశారు.2014లో తమిళనాడులోని మధురై కామరాజ్ యూనివర్శిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. మరో వైపు భారతీయ జనతా యువమోర్చాలో పలు కీలక బాధ్యతలను కూడ నిర్వహించారు. 1996లో మాజీ కేంద్ర మంత్రి ఎల్ కే అద్వానీ నిర్వహించిన రథయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు.35 రోజుల పాటు అద్వానీ (LK Advani) యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు.
కరీంనగర్ ఎంపీగా
2005లో కరీంనగర్ పట్టణంలోని 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పోరేటర్ గా ఆయన ఎన్నికయ్యారు. 2005 నుండి 2019 వరకు ఈ కార్పోరేటర్ స్థానంలో ఆయన ప్రాతినిథ్యం వహించారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించడంతో కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు. 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.2019 మే 23 నుండి కరీంనగర్ ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. మరో వైపు 1994 నుండి 2003 వరకు కరీంనగర్ అర్బన్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను 2020 మార్చి 11న ఆ పార్టీ నియమించింది. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంతో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్(kalvakuntla chandrashekar rao) నిర్ణయాలపై ఒంటికాలిపై విమర్శలు చేసేవారు. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే చర్చ కూడ తెరపైకి వచ్చింది. అయితే అదే సమయంలో సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ నాయకత్వం. బండి సంజయ్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ (Gangula kamalakar) చేతిలో ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఆయన మరోసారి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం తన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. మిగిలిన సమయంలో ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల సభల్లో బండి సంజయ్ ప్రచారం చేశారు.