బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నా.. తెలంగాణలో బీజేపీకి భంగపాటు, అధిష్టానానికి ‘‘పోస్ట్‌మార్టం’’ రిపోర్ట్

తెలంగాణలో మాత్రం ఆశించిన ఫలితాలను కమలదళం అందుకోలేకపోయింది. ఇక్కడ కీలక నేతలు ఓటమి పాలవ్వగా.. గెలుస్తామనుకున్న స్థానాల్లో చతికిలబడటం బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో వైఫల్యాలపై కిషన్ రెడ్డి లోతుగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించారు.

bjp comprehensive review on telangana assembly election results 2023 ksp

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలో వున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లను లాక్కోవడంతో పాటు మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే తెలంగాణలో మాత్రం ఆశించిన ఫలితాలను కమలదళం అందుకోలేకపోయింది. ఇక్కడ కీలక నేతలు ఓటమి పాలవ్వగా.. గెలుస్తామనుకున్న స్థానాల్లో చతికిలబడటం బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు.

కాకపోతే గత ఎన్నికలతో పోలిస్తే మెరుగైన సీట్లు సాధించడమే ఊరట కలిగించే విషయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లను, 14 శాతం ఓట్లను సొంతంగా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వైఫల్యాలపై కిషన్ రెడ్డి లోతుగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించారు. దీనిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాలకు అందజేయనున్నారు కిషన్ రెడ్డి. 

అయితే అధిష్టానం వద్దకు వెళ్లే ఆ ఫైలులో కిషన్ రెడ్డి ఎలాంటి అంశాలను ప్రస్తావించారనే దానిపై నేతల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందుకు బీజేపీ అందుకున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బీసీ సీఎం నినాదం ఎంత వరకు సక్సెస్ అయ్యిందన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 36 మంది బీసీలకు టికెట్లు ఇస్తే కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్లపై మిషన్ 31 అని కమిటీలు వేసినప్పటికీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. 

అలాగే గ్రేటర్‌లో ఎలాంటి ప్రభావం చూపకపోగా.. ఒక్క గోషామహాల్‌ని మాత్రమే నిలబెట్టుకోగలిగింది. పార్టీకి పట్టున్న ఉప్పల్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి స్థానాల్లోనూ ఓటమి పాలు కావడం చర్చనీయాంశమైంది. జీహెచ్ఎంసీలో 48 మంది కార్పోరేటర్లు , ఓ టీచర్ ఎమ్మెల్సీ వున్నా వారి సేవలను సరిగా వినియోగించుకోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చడంతోనే ఓటమి ఎదురైనట్లుగా నేతలు విశ్లేషిస్తున్నారు. 

మరోవైపు.. కరీంనగర్, బోధ్, కోరుట్ల, హుజురాబాద్ స్థానాలపై కమలనాథులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కీలక నేతలైన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులు ఓటమి పాలు కావడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిలో ఇద్దరిని సీఎం అభ్యర్ధులుగా ఫోకస్ చేసినప్పటికీ లెక్క తప్పడంతో ఎందుకు ఇలా జరిగిందన్న దానిపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి రిపోర్ట్ మేరకు ఎవరిని బాధ్యుల్ని చేస్తారనే భయం నెలకొంది..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios