తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన బుధవారం సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు.

సిరిసిల్ల, వేములవాడ, బోయిన్‌పల్లి దాకా రైలు రావాలంటే 16 స్థానాలను టీఆర్ఎస్‌కే కట్టబెట్టాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్... 16 మంది ఎంపీలతో ముఖ్యమంత్రి ఏం చేస్తారో అంచనా వేయాలన్నారు.

మే నెల నుంచి 57 ఏళ్ల వయసుకే రూ.2000 పెన్షన్ అందిస్తామన్నారు. వినోద్ ఎంపీగా గెలిచిన అనంతరం కృషి విజ్ఞాన్ కేంద్రాన్ని ముస్తాబాద్‌లో పెట్టుకుందామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్.. కేసీఆర్ వెంట నడిచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.  సారు-కారు-పదహారు-ఢిల్లీలో సర్కార్ ఇదే అందరి నినాదమని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.