Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు చిక్కులు: జైపాల్ రెడ్డి వెనక్కి, డీకే అరుణ విముఖత

 మహాబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుండి  పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు ఎవరూ కూడ ముందుకు రావడం లేదు

who will contest mahaboobnagar mp segment from congress
Author
Mahaboob Nagar, First Published Mar 5, 2019, 3:55 PM IST

మహాబూబ్‌నగర్: మహాబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుండి  పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు ఎవరూ కూడ ముందుకు రావడం లేదు. ఈ స్థానం నుండి పోటీ చేయాలని మాజీ మంత్రి డీకే అరుణను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరితే పోటీకి ఆమె విముఖత చూపింది. 

ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ మినహా అన్నిస్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. నాగర్‌ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని  కొల్లాపూర్ నుండి వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

మహాబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో ఈ స్థానంలో  పోటీకి కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుకు రావడం లేదు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి, డీకే అరుణలు కూడ ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తి చూపారని గతంలో ప్రచారం సాగింది. కానీ పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఇద్దరు నేతలు కూడ ఆసక్తిని చూపడం లేదు.

వారం  రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో మహాబూబ్ నగర్ పార్లమెంట్ సీటు నుండి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కుంతియా  మాజీ మంత్రి డికె అరుణను కోరారు.  అయితే  ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  అరుణ నిరాసక్తతను చూపించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆర్ధికంగా భారం ఎక్కువైందని ఈ సమావేశంలో ఆమె చెప్పారు. ఈ స్థానం నుండి జైపాల్ రెడ్డి  ఎందుకు పోటీ చేయడం లేదని  ఆమె ప్రశ్నించారు. కష్టకాలంలోనే సీనియర్లు పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు.

ప్రత్యర్థులు బలహీనంగా ఉన్న సమయంలో  పార్టీకి బలం ఉన్న సమయంలో పోటీకి  సీనియర్లు ముందుకు రావడంపై డీకే అరుణ మండిపడ్డారు.  అయితే మహాబూబ్ నగర్ ఎంపీ స్థానం నుండి సీనియర్లు పోటీకి ముందుకు రావడం లేదని సమాచారం.

జడ్చర్లకు చెందిన అనిరుధ్ రెడ్డి మహాబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుండి  పోటీకి సిద్దంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే  జడ్చర్ల టిక్కెట్టు కోసం అనిరుధ్ రెడ్డి చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. కానీ ఈ సీటు దక్కలేదు. దీంతో మహాబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుండి  పోటీకి సంసిద్ధంగా ఉన్నారని  పార్టీలో ప్రచారం సాగుతోంది.

మరో వైపు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కూడ మహాబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుండి పోటీకి సిద్దంగా ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే  టీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి మరోసారి బరిలోకి దిగుతారా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది.

 పార్టీ ప్రజా ప్రతినిధుల్లోనే జితేందర్ రెడ్డిపై వ్యతిరేకత ఉందనే ప్రచారం కూడ ఉంది. దీంతో జితేందర్ రెడ్డికి బదులుగా మరోకరిని  ఈ స్థానం నుండి బరిలోకి దింపే అవకాశం ఉందంటున్నారు.  లేదా మరోసారి జితేందర్ రెడ్డికి ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించే ఛాన్స్  లేకపోలేదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios