హైదరాబాద్: ఎంపీ ఎన్నికల ఫలితాలపై  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించనుందని ఆయన స్పష్టం చేశారు. 

సోమవారం నాడు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవనంలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలపై కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత మంత్రులదేనని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని ఆయన  ఆదేశించారు. ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను నిర్లక్ష్యం చేయకూడదని ఆయన పార్టీ నేతలకు సూచించారు.ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పదవికి మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్‌ పదవికి పుట్టా మధు పేర్లను కేసీఆర్ ఈ సమావేశంలో ప్రకటించారు.