హైదరాబాద్:పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాజీ ఎంపీ వివేక్ నిర్ణయం తీసుకొన్నారు. తనకు కేసీఆర్ ద్రోహం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.

పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని వివేక్ భావించారు. అయితే  పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేక్‌పై కేసీఆర్‌కు ఫిర్యాదులు చేశారు.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో  పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోని టీఆర్ఎస్ అభ్యర్ధులను ఓడించేందుకు వివేక్ పనిచేశారని కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.అయితే ఈ ఆరోపణలను వివేక్ తీవ్రంగా ఖండించారు.ఈ విషయాన్ని రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన ప్రకటించారు.

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన నేతకాని వెంకటేష్‌ మూడు రోజుల క్రితం టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరిన రోజునే పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి నేతకాని వెంకటేష్‌కు టీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది.

దీంతో పెద్దపల్లిలో వివేక్ తన అనుచరులతో రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు.  పోటీ చేయాలని ఆయన అనుచరులు, అభిమానులు కోరారు. అయితే ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా వివేక్ ప్రకటించారు.కేసీఆర్ చేసిన ద్రోహం వల్లే తనకు టిక్కెట్టు దక్కలేదన్నారు.తనకు ఇంతకాలం మద్దతుగా నిలిచిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.