పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం అప్రమత్తమయ్యింది. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. అందులో భాగంగా సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషితో సమావేశమయ్యారు. 

ఈ భేటీ అనంతరం రజత్ కుమార్ మాట్లాడుతూ...పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపైనే సీఎస్ తో చర్చించినట్లు  వెల్లడించారు. మరీ  ముఖ్యంగా ఈ ఎన్నికల కోసం  మరికొంత మంది సిబ్బందిని కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా వున్న సహాయ రిటర్నింగ్ అధికారి పోస్టులను వెంటను భర్తీ చేయాలని కోరినట్లు తెలిపారు. వీటి భర్తీతో రిటర్నింగ్ అధికారులపై పనిభారం తగ్గుతుందని...అందువల్ల ఎన్నికలు సజావుగా జరుగుతాయని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులు అన్ని చోట్లా  వున్నారు...కానీ ఏఆర్వోలు మాత్రమే తక్కువగా వున్నారన్నారు. 

తన విజ్ఞప్తిపై సీఎస్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. త్వరలోనే ఈ పోస్టులకు అర్హులైన అధికారుల భర్తీ చేపట్టనున్నట్లు రజత్ కుమార్ స్పష్టం చేశారు.