ముఖ్యమంత్రి కేసీఆర్ పై మళ్ళీ విమర్శలు ప్రారంభించిన రేవంత్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడం వల్లే పెద్ద నాయకుడన్న పేరు తెచ్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి భావిస్తున్నారన్నారు. కానీ అలా వ్యక్తిగత దూషణలకు దిగితే ఎప్పటికీ పెద్ద నాయకుడు కాలేరన్నారు. తనకు తాను ఓ పులి అని ఊహించుకునే రేవంత్ నిజానికి పేపర్, ప్లెక్సీ పులి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

సోమవారం తెలంగాణ భవన్ లో మీడియా సభ్యులతో కేటీఆర్ సంభాషించారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికలను గురించి ప్రస్తావిస్తూ...టీఆరెస్ పార్టీ నుండి పార్లమెంట్
అభ్యర్థులు ఎవరన్నది ముఖ్యం కాదన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కెసిఆరే పోటీ చేస్తున్నట్లు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఢిల్లీ రాజకీయాలను ఎలా హ్యాండిల్
 చేయాలె కేసీఆర్ కు తెలుసన్నారు. 

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రజలకు చేసిందేంటో చెప్పకుండా తమపై పడి ఏడుస్తున్నాడని అన్నారు. ఇప్పటికైనా ప్రజలకు, రాష్ట్రానికి చేసిందేంటో
చెప్పి ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. జగన్ ఫ్యాన్ కు స్విచ్ ఎక్కడుందో చెప్పే బాబుకు... ముందు సైకిల్ కు గాలి ఎవరు కొడుతున్నారో చూసుకోవాలన్నారు.ఆయన
భవిష్యత్ ను మరికొద్దిరోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.  ఆయన్ను ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమన్నారు. తాము ఏపీ వ్యవహారాల్లో తలదూర్చడంవ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ కు జాతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. భవిష్యత్తులో అవసరం అయితే జాతీయ పార్టీ పెడతామన్న కేసీఆర్ మాటలను కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు.కాంగ్రెస్ బీజేపీ,అంటే పడని పార్టీలు దేశంలో చాలాఉన్నాయని...వాటన్నింటిని కూడగడతామని తెలిపారు. ప్రజలకు ఏం అవసరమో అదే అజెండాగా ముందుకు వెళతామన్నారు.  కేసీఆర్ ఇప్పటికే దేశ  వ్యాప్తంగా వున్న మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలు సికింద్రాబాద్ మినహా అన్ని పార్లమెంటు సీట్ల లో ఉంటాయన్నారు. తాను మల్కాజిగిరి, సికింద్రాబాద్,చేవెళ్ల ప్రాంతాల్లో టీఆర్ఎస్ విజయంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ కు రాజకీయంగా ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేయాలో తెలుసన్నారు.  అందుకే అభ్యర్థుల విషయంలో
కేసీఆర్ ఆచి తూచి నిర్ణయం తీసుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా గతంలో ఇతరపార్టీల్లోకి చేరారని...అప్పుడు తామిలా గొంతు చించుకుని అరవలేదన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీ నేతలు చేరలేదా....అది పిరాయింపు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడే సమయంలో ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీని రాహుల్ కండువా కప్పి చేర్చుకోలేదా అని గుర్తుచేశారు. ఇప్పుడు తాము ఏదో దుర్మార్గం చేస్తున్నట్లు అరిచే కాంగ్రెస్ నాయకులు అప్పుడెక్కడ పోయారని కేటీఆర్ నిలదీశారు.