పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి టీఆర్ఎస్‌ అభ్యర్ధిగా నేతకాని వెంకటేష్‌ పేరును టీఆర్ఎస్‌ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.ఈ స్తానం నుండి మాజీ ఎంపీ వివేక్ ఆశిస్తున్నారు.వివేక్‌పై కొందరు నేతలు ఫిర్యాదు చేసిన కారణంగా వెంకటేష్ పేరును కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

గురువారం నాడు నేతకాని వెంకటేష్ కాంగ్రెస్ పార్టీని  వీడి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో నేతకాని వెంకటేష్ టీఆర్ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేతకాని వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా చెన్నూరు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కొందరు టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమి కోసం మాజీ ఎంపీ వివేక్ ప్రయత్నించారని ఆరోపణలు చేశారు.ఈ విషయమై ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ గతంలోనే వివేక్ ‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలను వివేక్ కొట్టిపారేశారు.   పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ గురువారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో వివేక్‌పై కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

దీంతో పెద్దపల్లి స్థానంలో వివేక్‌కు బదులుగా నేతకాని వెంకటేష్‌ పేరును పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.