హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో విజయదుందుభిమోగించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పంథాను అనుసరించాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్, పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పంథాను ఎంచుకున్నారు. మంగళవారం ఒకేసారి పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.  

మంగళవారం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసేందుకు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలంటూ పలువురికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. 

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హోరెత్తిస్తున్నారు. నిజామాబాద్ కవిత, జహీరాబాద్ బీబీ పాటిల్, మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నగేష్, వరంగల్ పసునూరి దయాకర్ లకు తిరిగి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

మిగిలిన స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలప్రచారంలో భాగంగా మంగళవారం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులను ప్రకటిస్తారా లేక నిజామాబాద్ టూర్ అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 

ఇప్పటి వరకు అధికారికంగా కేసీఆర్ కరీనంగర్ ఎంపీగా వినోద్ కుమార్ ను ఆదివారం కరీనంగర్ బహిరంగ సభలో ప్రకటించారు. కేసీఆర్ తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో వినోద్ కుమార్ సోమవారం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.  

ఇకపోతే రాబోయే ఎన్నికల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబాద్  ఎంపీ ప్రొ.సీతారాం నాయక్ లకు తిరిగి టికెట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్త అభ్యర్థులను పోటీకి దించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం.