ఖమ్మం: ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తరపున ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అలిగారు. 

ఖమ్మం టికెట్ ను గురువారం టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించారు కేసీఆర్.  దీంతో అలిగిన ఆయన శుక్రవారం ఖమ్మం జిల్లా నేతలతో జరిగిన సమావేశానికి సైతం ఆయన డుమ్మా కొట్టారు. అంతేకాదు ఎవరికీ ఫోన్లో కూడా టచ్ లో లేరని తెలుస్తోంది. 

అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించని నేపథ్యంలో పొంగులేటి కోసమే టికెట్ కేటాయించలేదంటూ ప్రచారం జరుగుతుంది. 

ఈ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుగా చౌదరి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓటమికి కారణమయ్యారంటూ ప్రచారం ఉంది. 

టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు సహకరిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఓటమికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమయ్యారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.