హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిజామాబాద్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను చంద్రబాబు నాయుడు చాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. 

నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కవిత రిటర్న్‌ గిఫ్ట్‌ విషయంలో చంద్రబాబు కంగారు పడుతున్నారని, సరైన సమయంలో కేసీఆర్‌ తప్పకుండా ఇస్తారని మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు విమర్శలపై కేసీఆర్‌ త్వరలోనే స్పందిస్తారని చెప్పారు. 

యుద్ధం యుద్ధం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తమకు ఎవరితోనూ యుద్ధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే వారితోనే తాము యుద్ధం చేస్తామని పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. 

తమకు పార్లమెంట్‌ ఎన్నికలు ముఖ్యమని, ప్రజల ఆశీస్సుల కోసం వెళ్తున్నామని చెప్పారు. ఉద్యమ సమయంలోనూ అవసరమైన సందర్భాల్లోనే కేసీఆర్‌ మాట్లాడారని, ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఏది అవసరమనుకుంటే అదే చేస్తున్నారని తెలిపారు. 

చంద్రబాబు కేసీఆర్‌ను ఎంత మిస్‌ అయినా స్పందించాల్సిన సమయంలోనే స్పందిస్తారని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని, రైతుల పేరిట నామినేషన్లు వేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్‌లో తనపై పోటీ చేస్తే రైతుల సమస్య పరిష్కారమవుతుందంటే స్వాగతిస్తానని కవిత స్పష్టం చేశారు.