నిజామాబాద్ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీమీదున్న నమ్మకంతో లోక్ సభ ఎన్నికల్లో తనను గెలిపించడానికి సిద్దంగా వున్నారని ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఓటే కాదు ఎన్నికల ఖర్చు కోసం నోటు(డబ్బులు) కూడా ఇస్తున్నారని తెలిపారు. ఆమె శుక్రవారం నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని బఢా భీంగల్ లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు టీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాలు ఆమెకు కొంత డబ్బును ఎన్నికల ఖర్చు కోసం అందించారు. 

ఈ ప్రచార సభలో కవిత మాట్లాడుతూ....తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ భోళా శంక‌రుడని అన్నారు. అందువల్లే వెయ్యి రూపాయ‌ల పెన్ష‌న్‌ను రెండు వేలు చేశారని, మే1 తేదీ నుంచి పెంచిన పెన్ష‌న్ డ‌బ్బులు లబ్ధిదారులకు అందుతాయన్నారు. మొత్తంగా బ‌డా భీంగ‌ల్‌లో 1260 మందికి  పెన్ష‌న్‌లు వ‌స్తున్నాయని...అందులో సగం మంది మ‌హిళ‌లే కావ‌డం తనకు సంతోషాన్నిచ్చే విష‌యమన్నారు. అలాగే ఉచిత కంటి ప‌రీక్ష‌లు చేయిస్తున్న ప్ర‌భుత్వం త్వరలో ఒంటి ప‌రీక్ష‌లూ చేయించ‌నుంద‌ని తెలిపారు. 

గత ఎన్నికల సందర్భంగా తండాల‌ను పంచాయ‌తీల‌ను చేస్తామ‌ని హామీ  ఇచ్చామని...కమిట్ మెంట్ తో ఆ మాట నిలబెట్టుకున్నామని గుర్తుచేశారు. అలాగే సేవాలాల్ జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హించింది  కూడా టిఆర్ఎస్ ప్ర‌భుత్వంమేనని  కవిత తెలియజేశారు. 

ఇక ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సొంత స్థలాలుండి ఇళ్లు క‌ట్టుకునే ఆర్థిక స్థోమ‌త లేని వారికి రూ. 5 ల‌క్ష‌ల ఆర్థికసాయం ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని... జాగాలు లేని వారికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వమే క‌ట్టించి ఇస్తుందని తెలిపారు. ఎన్నిక‌ల ముగిశాక అధికారులు మీ ఊరికి వ‌చ్చి వివ‌రాలు సేక‌రిస్తార‌ని క‌విత తెలిపారు. 

ఆత్మ‌గౌర‌వంతో కూడిన అభివృద్ది అందిచాలనే తాము ప్రయత్నిస్తున్నట్లు కవిత వెల్లడించారు. దీని కోసం కేసిఆర్ అహ‌ర్నిశ‌లు శ్ర‌హిస్తున్నార‌ని తెలిపారు. 
మీ మీద న‌మ్మ‌కంతో టిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతోందన్నారు. మొద‌టి కేబినెట్ మీటింగ్‌లోనే మ‌న 7 మండ‌లాల‌ను ఆంధ్ర‌లో క‌లిపేసిన బిజెపి ప్ర‌భుత్వంపై పార్ల‌మెంటులో అడుగు పెట్టిన రోజే  కొట్లాట మొద‌లు పెట్టామ‌న్నారు.

జాతీయ పార్టీల‌కు చాలా అంశాలు ముఖ్యం..కాని టిఆర్ఎస్‌కు తెలంగాణ ప్ర‌యోజ‌నాలు ఒక్క‌టే ముఖ్య‌మ‌ని కవిత పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఎంపిలు గెలిస్తే న‌రేంద్ర మోడికి లాభం అవుతుందని... కాంగ్రెస్ ఎంపిలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం అవుతుందన్నారు. కాని టిఆర్ఎస్ ఎంపిలు గెలిస్తే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు లాభం జ‌రుగుతుంద‌ని క‌విత అన్నారు.  

వీడియో

"