తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజకీయ ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటిక్రితమే మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి 107వ పోలింగ్ బూత్  కు వెళ్లి హరీష్ ఓటేశారు. 

అనంతరం హరీష్ మాట్లాడుతూ... ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి పోలింగ్ బూత్ కు వెళ్లెటప్పుడు తప్పకుండా ఓటర్ గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలని సూచించారు. లేదంటే ఎన్నికల సంఘం సూచించిన ఏదైనా ఐడీ కార్డును వెంటతీసుకెళ్లాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని..అందువల్ల ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 

కొద్దిరోజుల క్రితం జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఎలాగైతే భారీగా పోలింగ్ లో పాల్గొన్నారో అలాగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటు వేయడానికి కదలాలని పిలుపునిచ్చారు.  ఎండలకు భయపడకుండా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఓటు వేయడానికి ముందుకు రావాలన్నారు. ఎండల నుండి ఉపశమనానికి పోలింగ్ భూతుల్లో అధికారులు తగినన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. కాబట్టి పోలింగ్ లో అధిక సంఖ్యలో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. 

పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని విద్యావంతులు, వ్యాపారస్తులు,మేధావులు ఈరోజును హాలిడేగా భావించకుండా ఓటేయడానికి కదలాలన్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా ఏవైనా పనులున్నా వాటిని పక్కనబెట్టి ఓటేయడానికి కొంచెం సమయం కేటాయించాలని హరీష్  సూచించారు.