నిజామాబాద్: టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ నెల 21న టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు గులాబీ దళపతి, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. 

నిజామాబాద్ టీఆర్‌ఎస్ పార్లమెంటరీస్థాయి సన్నాహక బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనపై క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించిన ప్రజలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

ఎమ్మెల్యేలను గెలిపించినన ప్రజలు ఎంపీలను కూడా గెలిపిస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఒక బండి ముందుకు పోవాలంటే రెండు కోడెలాగలు కట్టాలి లేకపోతే రెండు దున్నపోతులను కట్టాలి అన్నారు. 

కానీ ఓ పక్కన దున్నపోతును ఇంకోపక్క కోడెలాగను కడితే ఆ బండి ముందుకు పోతుందా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన మీరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 మంది పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

16కు 16 పార్లమెంట్ అభ్యర్థులను గెలిపిస్తే ఆ శక్తితో, ఆ బలంతో రాష్ట్రాన్ని బాగుచేసుకుంటామన్నారు. అంతేకాదు దేశానికి ఒక మార్గదర్శనం చేద్దామన్నారు. అది జరగాలంటే ప్రజల దీవెన, సహకారం ఎంతో అవసరం అని చెప్పుకొచ్చారు. అభ్యర్థి ఎవరైనా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.