కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రస్తుతమున్న రిజర్వేషన్ వ్యవస్థను మారుస్తామని టిపిసిసి చీఫ్, నల్గొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో జనాబా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. 

నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా త్రిపురారంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేసి మరోసారి నల్గొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సూచించారు. ఇలా మన రాష్ట్రం నుండి అధిక ఎంపీలను గెలిపించుకుని రాహుల్ గాంధీ ప్రధాని పీఠాన్ని అధిరోహించేలా సహకరించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. 

16 ఎంపీ స్థానాల్లో గెలిచినా టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఏమీ చేయలేరని...కేవలం ప్రజలను మరోసారి మోసం చేయడానికే చక్రం తిప్పుతామని  ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇతరు పార్టీల నుండి చేర్చుకున్న ఎంపీలతో కలిపి ప్రస్తుత లోక్ సభలో టీఆర్ఎస్ కు 14మంది ఎంపీల బలముందని ఉత్తమ్ గుర్తుచేశారు. ఇప్పుడు చేయనిది భవిష్యత్ లో చేస్తారని నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా లేరని ఉత్తమ్ పేర్కొన్నారు. 

ఇప్పటికే ముస్లిం మైనారిటీలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతానని హమీ ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటతప్పారని అన్నారు. ఇలా మోసం చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారని...మరోసారి అలాంటి మోసాలను ఎవరూ నమ్మబోరన్నారు. ముందు ఆ రిజర్వేషన్ల సంగతేంటో తేల్చాలని ఉత్తమ్ తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను డిమాండ్ చేశారు.