హైదరాబాద్: బలమైన సిట్టింగులకు షాక్ ఇస్తూ కొత్త అభ్యర్థులను లోకసభకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎంపిక చేయడం వెనక బలమైన వ్యూహమే ఉందని భావిస్తున్నారు. టికెట్లు నిరాకరించిన జితేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతారాం నాయక్ బలమైన అభ్యర్థులే. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థులే.

వారి స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టారా అంటే అదీ లేదు. అయితే, సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. మిగతా ముగ్గురికి మాత్రం అటువంటి హామీలేమీ లేవు. పైగా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెసులో చేరి తిరిగి ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పెద్దపల్లి నుంచి వివేక్ కు టికెట్ నిరాకరించడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. వివేక్ కూడా కాంగ్రెసులోకి వెళ్లి పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నేతకాని వెంకటేష్ ను కేసీఆర్ ఎంపిక చేశారు. వెంకటేష్ చెన్నూరు శానససభ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన వివేక్ ను ఎదుర్కోగలరా అనేది ప్రశ్న.

ఖమ్మం విషయంలో మాత్రమే బలమైన అభ్యర్థిని రంగంలోకి దించుతున్నట్లు భావించవచ్చు. పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పోలిస్తే నామా నాగేశ్వరరావు బలమైన అభ్యర్థే అనుకోవచ్చు. అయితే, గత ఎన్నికల్లో నామా నాగేశ్వర రావు పొంగులేటి శ్రీనివాస రెడ్డిపైనే ఓడిపోయారు. పొంగులేటి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.

జితేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ సీటుకు మన్నె శ్రీనివాస రెడ్డిని పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. బిజెపి అభ్యర్థిగా మాజీ మంత్రి డీకె అరుణ పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ స్థితిలో మన్నె శ్రీనివాస్ రెడ్డి ఏ మేరకు గెలుపు గుర్రం కాగలరనేది ప్రశ్న.

నల్లగొండ నుంచి తెలంగాణ కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనపై కేసీఆర్ వేంరెడ్డి నర్సింహారెడ్డిని పోటీకి దించుతున్నారు. సుఖేందర్ రెడ్డితో పోలిస్తే నర్సింహా రెడ్డి అంత బలమైన అభ్యర్థేమీ కారు. 

చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డిపై డాక్టర్ రంజిత్ రెడ్డిని కేసీఆర్ బరిలోకి దింపారు. విశ్వేశ్వర రెడ్డి బలంతో పోలిస్తే రంజిత్ రెడ్డి బలం తక్కువేనని చెప్పవచ్చు. నిజానికి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీకి దింపుతారని భావించారు. రంజిత్ రెడ్డితో పోలిస్తే మహేందర్ రెడ్డి మెరుగైన అభ్యర్థి కాగలరు. అదే సమయంలో టీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డికి టికెట్ ఇవ్వవచ్చునని కూడా భావించారు.

అయితే, కేసీఆర్ లోకసభ ఎన్నికల్లో ప్రయోగమే చేస్తున్నారు. ఆ ప్రయోగం కూడా పక్కా వ్యూహంతో చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని పార్లమెంటు అభ్యర్థులను ఎంపిక చేశారు. 

పలువురు కాంగ్రెసు శాసనసభ్యులు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఈ స్థితిలో శాసనసభ ఎన్నికల్లో పోటీ మాదిరిగా లోకసభ ఎన్నికలను మార్చి కేసీఆర్ ప్రయోగం చేస్తున్నారని చెప్పవచ్చు. ఏ లోకసభ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఆ లోకసభకు పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతలను మోసే విధంగా ఆయన వ్యూహరచన చేశారు. 

ఏ శాసనసభ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే లోకసభ అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సి ఉంటుంది. లోకసభ అభ్యర్థులు తమ స్థాయిలో తాము గెలిచేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలోనే వారిని గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యేలను భుజాన మోయనున్నారు. 

ప్రస్తుతం టీఆర్ఎస్ కు 100 మంది శాసనసభ్యుల బలం ఉంది. శాసనసభ మొత్తం సీట్లు 117. అందువల్ల వంద మంది ఎమ్మెల్యేలు పూనుకుంటే 16 లోకసభ స్థానాలను గెలుచుకోవడం సులభం అనేది కేసీఆర్ ఆలోచన. అభ్యర్థి బలమైనవాడా, కాదా అనేది ద్వితియమే అవుతుంది.

అంతర్గత వ్యూహం అది కాగా, బహిరంగ వేదికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే లోకసభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆయన అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అటు బిజెపిని, ఇటు కాంగ్రెసును ఎదుర్కుంటూ ఆయన విమర్శల జడివాన కురిపిస్తున్నారు. కాంగ్రెసు గానీ బిజెపి గానీ ఇప్పటి వరకు ప్రచారం ప్రారంభించిన దాఖలాలు లేవు. 

దానికితోడు, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ టీఆర్ఎస్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. దీంతో మైనారిటీ ఓట్లు పూర్తి స్థాయిలో తమకు పడుతాయని కేసీఆర్ విశ్వసిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన బిజెపిపై విమర్శలు కూడా పెడుతున్నారు. బిజెపి హిందూ ఎజెండాను ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా కలిసి వస్తుందనేది కేసిఆర్ నమ్మకం.