Asianet News TeluguAsianet News Telugu

స్థానిక డిమాండ్: కాంగ్రెస్‌కు తలనొప్పులు

 తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్థానికులకే టిక్కెట్లు ఇవ్వాలని  డిమాండ్ చేస్తున్నారు. కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో స్థానికేతరులకు టిక్కెట్లు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

Telangana: Local andolan within Congress over Lok Sabha ticket
Author
Hyderabad, First Published Mar 7, 2019, 4:42 PM IST

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్థానికులకే టిక్కెట్లు ఇవ్వాలని  డిమాండ్ చేస్తున్నారు. కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో స్థానికేతరులకు టిక్కెట్లు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకు ఎంపీ టిక్కెట్లు ఇవ్వకపోతే రెబెల్‌గా పోటీ చేసేందుకు సై అంటున్నారు. లేదా పార్టీ ప్రకటించిన అధికారిక అభ్యర్ధులకు వ్యతిరేకంగా పోటీకి దిగుతామని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో స్థానికులకే  టిక్కెట్లు ఇవ్వాలని  కొందరు నేతలు  డిమాండ్‌ చేస్తున్నారు. నాగర్‌కర్నూల్, ఖమ్మం, పెద్దపల్లి, భువనగరి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లోని  స్థానికులకే ఎంపీ టిక్కెట్లు ఇవ్వాలని కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు.

ఈ నియోజకవర్గాల్లో స్థానికులకే టిక్కెట్లు ఇవ్వకపోతే  పార్టీ ప్రకటించే అధికారిక అభ్యర్ధులకు వ్యతిరేకంగా పనిచేస్తామని కూడ  తేల్చి చెప్పేశారు.  అంతేకాదు అవసరమైతే  రెబెల్‌గా పోటీకి దిగేందుకు కూడ వెనుకాడబోమని కూడ చెబుతున్నారు.  ఆయా నియోజకవర్గాల నేతల నుండి వస్తున్న డిమాండ్ కాంగ్రెస్ నాయకత్వానికి చుక్కలు చూపెడుతోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారంగా నేతలు ఎవరైనా కూడ తాము కోరుకొన్న స్థానం నుండి పోటీ చేసేందుకు ధరఖాస్తు చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఏ అభ్యర్థి ఏ స్థానం నుండి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని టిక్కెట్లను కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు.

2014 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్  నుండి నంది ఎల్లయ్య కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  నంది ఎల్లయ్య స్థానికేతరుడు. దీంతో వచ్చే ఎన్నికల్లో  ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్  కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఇదే స్థానం నుండి తనకు కూడ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపీ మల్లు రవి కూడ కోరుతున్నారు. గతంలో ఈ స్థానం నుండి మల్లు రవి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు.

టీడీపీ నుండి  కాంగ్రెస్ పార్టీలో చేరిన సతీష్ మాదిగ కూడ ఈ స్థానం నుండి తనకు టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఖమ్మం ఎంపీ స్థానాన్ని స్థానికులకే ఇవ్వాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరుతున్నారు. రేణుకా చౌదరి ఈ స్థానం నుండి పోటీ చేయడాన్ని వ్యతిరేకించేందుకు గాను  స్థానిక నినాదాన్ని తెరమీదికి తెచ్చారనే ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. 

మహబూబాబాద్, పెద్దపల్లి, భువనగిరి, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల్లో కూడ స్థానికులకే టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ మధు యాష్కీ భువనగిరి నుండి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది.2004,2009 ఎన్నికల్లో యాష్కీ నిజామాబాద్ నుండి విజయం సాధించారు.  

గత ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ లేదా భువనగిరి నుండి పోటీకి సిద్దంగా ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పారు.  ఈ తరుణంలో  మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాత్రం మధు యాష్కీని నిజామాబాద్ నుండే పోటీ చేయాలని కోరినట్టు సమాచారం.యాష్కీ భువనగిరి నుండి పోటీ చేస్తే స్థానిక నేతలు ఏ మేరకు సహకరిస్తారనే చర్చ కూడ లేకపోలేదు.


 

Follow Us:
Download App:
  • android
  • ios