గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులందరూ హైట్, పర్సనాలిటీలో తనకన్నా బలంగా ఉండేవారని కానీ వారు చేసిందేమిటని ప్రశ్నించారు తెలంగాణ సీఎం కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం సోమవారం గోదావరిఖనిలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.

స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని ఏలుతున్నాయని... మోడీని దించి రాహుల్‌ను ప్రధానిని చేస్తే పేర్లు మారతామని దీనదయాళ్, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ పేర్లు పోతాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

వారి స్థానంలో నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ పేర్లు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు సరిహద్దుల్లో సైనికుల వలే కష్టపడుతున్నారని, వారి ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానంతో పాటు తాను స్వయంగా వెళ్లి  మోడీకి వివరించానని కేసీఆర్ గుర్తు చేశారు.

2001లో తెలంగాణ కోసం పంచాయతీ పెట్టుకున్నానని కేసీఆర్ తెలిపారు. దేశంలో ఎన్నో సమస్యలుంటే అవన్ని వదిలేసి కేసీఆర్ జాతకాలు చూపించుకుంటాడు.. సంకలో గొక్కుంటాడని ప్రధాని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

రిజర్వ్ బ్యాంక్, మహారత్న కంపెనీల వద్ద కోట్ల రూపాయలు మూలుగుతున్నాయని వాటిని వాడే తెలివి ఏ ఒక్కరికి లేదని సీఎం మండిపడ్డారు. మానవ వనరులు, యువత, ఖనిజాలు అన్ని ఉండి కూడా కొందరు సన్నాసులు దేశాన్ని పరిపాలించడం వల్ల భారతదేశం వెనుకబడిపోయిందన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ స్వంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఒక్క తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమం విజయవంతంగా అమలౌతుందని కేసీఆర్ తెలిపారు. మోడీ, రాహుల్ సభలకు జనం రావడం లేదన్నారు. రేపు దేశాన్ని పరిపాలించేది ప్రాంతీయ పార్టీ అభ్యర్థేనని సీఎం జోస్యం చెప్పారు.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలో ఎన్నో రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. రామగుండలో మెడికల్ కాలేజీ, చెన్నూరును రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు.

రానున్న రోజుల్లో గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. జూన్, జూలై నెలల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తానన్నారు.. అయితే తాను రెవెన్యూ ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారని అటువంటి పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం చేయదని కేసీఆర్ స్పష్టం చేశారు.