దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే అమలుచేయాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందుకోసం తమ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ప్రత్యర్థులను మరోసారి ఇరుకునపెట్టే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇలా వేగంగా, పొరపాట్లు లేని నిర్ణయాల ద్వారా ఈ లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేందుకు టీఆర్ఎస్ వ్యూహాలను సిద్దం చేసింది.  

దీంట్లో భాగంగానే ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల సన్నాహక సభల్లో పాల్గొంటూ క్యాడర్ ను సమాయత్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలపై ప్రజల్లో వున్న ఆదరణ, గెలుపు అవకాశాలపై స్థానిక నాయకుల ద్వారా ఆరా తీస్తున్నారు. ఇలా ఇప్పటివరకు కేటీఆర్ అందించిన సమాచారం, ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు కేసీఆర్ కొన్ని ఎంపీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ 16, మిత్రపక్షం ఎంఐఎం 1 స్థానాన్ని గెలుచుకుంటుందని మొదటి నుండి కేసీఆర్, కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే అభ్యర్థుల ఎంపిక కూడా వుంటుందని కూడా ప్రకటిచారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా గెలిచే అవకాశమున్న సిట్టింగ్ లకు మరోసారి అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్  భావిస్తున్నారు. 

ఇలా ఇప్పటికే నిజామాబాద్ నుండి కవిత, మెదక్ నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి, జహిరాబాద్ నుండి బిబి పాటిల్, భువనగిరి నుండి  బూర నర్సయ్య గౌడ్, కరీంనగర్ నుండి వినోద్ కుమార్, ఆదిలాబాద్ నుండి నగేష్ లను టీఆర్ఎస్ అభ్యర్థులుగా కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 15,16 తేదీల్లో సిట్టింగ్ ఎంపీలందరితో కేసీఆర్ సమావేశమైన తర్వాత మొదటి విడతగా వీరి పేర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.