తెలంగాణ సీఎం కేసీఆర్ ది వక్రబుద్ధి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ అసదుద్దీన్ కంటే పెద్ద ముస్లిం అని వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు.

బీజేపీకి 150 సీట్లు కాదు.. 300 సీట్లు వస్తాయని.. అది నిజమైతే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాలు విసిరారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే దేశంలో రాజకీయంగా పెనుమార్పులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు.

మోదీ మళ్లీ ప్రధాన మంత్రి అయ్యాక... కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి విచారణ చేపడతామని చెప్పారు. మహబూబ్ నగర్ లో మోదీ సభ కేసీఆర్ లో వణుకు పుట్టించిందన్నారు. మండుటెండను కూడా పట్టించుకోకుండా మోదీ సభకు ప్రజలు తరలివచ్చారని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీలను ఓడగొడితేనే కేసీఆర్‌ ఫాం హౌస్‌ నుంచి సచివాలయా​నికి వస్తాడని వ్యాఖ్యానించారు. సారు కారు పదమారు సర్కారు కాదు.. బారు, బీరు సర్కారు అన్న చందంగా ఈ ప్రభుత్వ తీరు ఉందని తీవ్రంగా దుయ్యబట్టారు. మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి, గిరిజన మంత్రి కూడా లేరని మండిపడ్డారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ ఉంటే ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తారనుకుంటే విచ్చిలవిడిగా డబ్బులకు పదవులకు అమ్ముడుపోతూ పార్టీ మారుతున్నారని విమర్శించారు.