తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధి రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలకు దిగారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకే పరిమితమని అన్నారు. ఫెడరల్ ప్రంట్ పేరుతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసి అధికారం చేపడతామంటూ ఆయన చేసుకుంటున్న ప్రచారమంతా ఉత్తిదే అన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి లకే... వాటి తరపున ఆట రాహుల్, మోదీ మధ్యే వుంటుందని రేవంత్ వెల్లడించారు. 

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి లోక్ సభ అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో అతడు వెంటనే ప్రచార బరిలోకి దిగారు. శనివారం  జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేముందు దేవును ఆశిస్సులు పొందాలనే ఉద్దేశంతో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. 

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇవాళ్టి నుండే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా, కేసీఆర్ పాత్ర వుండవని అన్నారు. మల్కాజిగిరి ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకం వుందని రేవంత్ తెలిపారు.