హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు జాతీయపార్టీ పెట్టలేరని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి కాంగ్రెసు అభ్యర్థి రేవంత్‌రెడ్డి అన్నారు. టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాంతో రేవంత్‌రెడ్డి భేటీ అయిన తర్వాత సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. 

మల్కాజిగిరిలో తనకు మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోదండరామ్ ను కోరారు. కేసీఆర్ జాతీయపార్టీ పెట్టకుంటే ఓట్లు అడగనని ప్రకటిస్తారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ చెబుతున్నట్టు 120 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 

కేసీఆర్‌తో జట్టు కట్టేవారే లేరని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన ప్రతిపక్షాల ధర్నాకు కేసీఆర్‌ మద్దతు ప్రకటించలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పాత్ర చాలా పరిమితం అవుతుందని అన్నారు.

మల్కాజిగిరిలో తన విజయాన్నికి కోదండరామ్ మద్దతు అవసరమని ఆయన అన్నారు. మల్కాజిగిరి మినీ భారతదేశమని అన్నారు. మల్కాజిగిరి సమస్యలపై తాను పోరాటం చేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ చెప్పారు.