హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసంతృప్తులకు బిజెపి గాలం వేస్తోంది. వారిని తమ పార్టీలోకి తీసుకుని లోకసభ టికెట్లు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగానే తెలంగాణలోని కొన్ని లోకసభ స్థానాలను పెండింగులో పెట్టింది.

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెసు నేతలను తమ పార్టీలోకి తీసుకుని రావడానికి బిజెపి నేత రామ్ మాధవ్ హైదరాబాదులో మకాం వేశారు. తాజాగా, పెద్దపల్లి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన వివేక్ కు ఆయన గాలం వేస్తున్నారు. ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు.

కాగా, కాంగ్రెసు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో గత కొద్ది రోజులుగా బిజెపి నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా, డికె అరుణ, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సునీతా లక్ష్మారెడ్డితో సమావేశమయ్యారు. డికె అరుణ ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.

సునీతా లక్ష్మారెడ్డికి నచ్చజెప్పడానికి డికె అరుణ ప్రయత్నిస్తున్నారు. మెదక్ లోకసభ స్థానం టీకెట్ ను సునీతా లక్ష్మారెడ్డికి ఇచ్చేందుకు బిజెపి సిద్ధంగా ఉంది. అదే విధంగా ఖమ్మం లోకసభ టీఆర్ఎస్ టికెట్ దక్కని పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కూడా బిజెపి నేతలు చర్చలు జరుపుతున్నారు. మహబూబ్ నగర్ టికెట్ దక్కని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి తాను పార్టీ మారబోనని చెప్పారు.