హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. 16 మంది ఎంపీలను గెలిపించాలని అంటున్న కేటీఆర్‌ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సవాల్ చేశారు. 
కాంగ్రెస్‌ ఎంపీ నంది ఎల్లయ్య కాకుండా... ఇంతకుముందు ఉన్న 15 ఎంపీలతో టీఆర్‌ఎస్‌ సాధించింది ఏమిటో ప్రజలకు చెప్పాలని పొన్నం డిమాండ్‌ చేశారు. 15 మంది ఎంపీలతో ఒక్క విభజన హామీ అయినా సాధించారా అని అడిగారు. తెలంగాణ కోసం పొన్నం ప్రభాకర్‌ ఏం చేశాడో నీ తండ్రిని అడగాలని ఆయన కెటిఆర్ కు సూచించారు. 

అమరుల రక్తపు కూడు తింటున్నది కేసీఆర్‌ కుటుంబమేనని ఆయన అన్నారు.  అమరవీరుల శవాలపై కేటీఆర్‌ పేలాలు ఏరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 2004లో కాంగ్రెస్‌ భిక్షతోనే కేసీఆర్‌, కరీంనగర్‌ ఎంపీ అయింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తనపై మాట్లాడే ముందు కేటీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. లక్ష రూపాయల జీతం కోసం అమెరికా వెళ్లిన కేటీఆర్‌ కు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 

కరీంనగర్‌ రా.. నేనేంటో నీవేంటో తెలుస్తుందని ఆయన కేటీఆర్ కు  సవాల్‌ విసిరారు. తెలంగాణా కోసం అప్పటి సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి హెలికాఫ్టర్‌ను పేలుస్తానని తాను అన్నానని, కేటీఆర్‌ మాత్రం కిరణ్‌తో పైరవీలు చేసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్‌ యువరాజుగా ఫీలవుతున్నారని, జాగ్రత్త అని అన్నారు. కేసీఆర్‌ అంటేనే అబద్ధాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని ఢిల్లీలో రికార్డు ఉందని అన్నారు.