మహబూబ్‌నగర్:ఏప్రిల్, మే మాసంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఓడిపోవాల్సి  వస్తోందని  జ్యోతిష్యులు ఇచ్చిన సలహా మేరకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు.

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శుక్రవారం నాడు నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు.  సురవరం ప్రతాప్ రెడ్డి, కపిలవాయి లింగమూర్తి,ని మోడీ స్మరించుకొన్నారు.

తెలంగాణలో ముందుస్తు ఎన్నికలు ఎందుకో కేసీఆర్ స్పష్టత ఇవ్వలేదో చెప్పలేదని ఆయన విమర్శలు గుప్పించారు.. జ్యోతిష్యుల సలహా మేరకు కేసీఆర్ పాలనను గాలికి కేసీఆర్ వదిలేశారని ఆయన ఆరోపించారు.

ఏప్రిల్, మే మాసంలో  కేసీఆర్ జాతకం బాగాలేదని... అదే సమయంలో మోడీ జాతకం బాగా ఉందని జ్యోతిష్యులు కేసీఆర్‌కు చెప్పారన్నారు. దీంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని  ఆయన వివరించారు. ముందస్తు ఎన్నికల కారణంగా వందల కోట్ల రూపాయాల ఖర్చు ప్రజలపై అదనంగా పడుతోందని మోడీ చెప్పారు. 

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఒకే పార్శానికి చెందిన నాణెలని మోడీ ఆరోపించారు. ఈ ఐదేళ్లలో కేసీఆర్ కుటుంబం బాగుపడిందన్నారు. కానీ, తెలంగాణ ప్రజలు మాత్రం బాగుపడలేదని ఆయన విమర్శించారు.

కేసీఆర్ తన కుటుంబం కోసం ప్రజలను గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగంలో లేని ముస్లింల రిజర్వేషన్లను పదే పదే ప్రస్తావించడం ఎవరి కోసమో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేసీఆర్ తన ముద్ర  వేసుకొంటున్నారని ఆరోపించారు.  తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పి ఆ ఇళ్లను నిర్మించలేదని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ రహదారులను, రైల్వే లైన్లను ఎక్కువగా మంజూరు చేసినట్టుగా ఆయన వివరించారు.  

మీ ఆదేశాన్ని శిరసావహిస్తానని ఆయన ప్రకటించారు.   మీ ఆశీర్వాదం పొందేందుకు మళ్ళీ వచ్చానని ఆయన చెప్పారు,  చౌకీదారుడిగా 60 నెలలు పనిచేసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల పాటు రాత్రి పగలు లేకుండా కష్టపడినట్టు చెప్పారు.  

అనేక విషయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకొన్నట్టుగా ఆయన వివరించారు.  మీరు ఓటేసింది కేవలం ప్రధానమంత్రి కోసం కాదు నవ భారత నిర్మాణం కోసమని ఆయన వివరించారు. గతంలో అనేక చోట్ల హింస, విధ్వంసాలు చోటు చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.

ఉగ్రవాదుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని ఆయన చెప్పారు. విపక్షాలు ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో వంచిస్తున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో మీరంతా కాంగ్రెస్  పార్టీ పాలనను చూశారు. 60 మాసాల బీజేపీ పాలనను కూడ చూశారని ఆయన వివరించారు.