ఖమ్మం: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పెద్ద షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నేతగా మెలుగుతూ వచ్చిన నామా నాగేశ్వర రావు త్వరలో కారెక్కనున్నారు. ఆయన సోమవారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావును కలిశారు. దీంతో ఆయన టీఆర్ఎస్ చేరడం ఖాయమైనట్లు చెబుతున్నారు. 

ఖమ్మం లోకసభ స్థానానికి నామా నాగేశ్వర రావు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయన ఖమ్మం లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన రాకతో ఖమ్మంలో టీఆర్ఎస్ బలం పుంజుకోనుంది. శాసనసభ ఎన్నికల్లో నామా నాగేశ్వర రావు మహా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

నిజానికి, ఖమ్మం లోకసభ స్థానానికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నామా నాగేశ్వర రావు పోటీ చేస్తారని భావించారు. అయితే, ఖమ్మం టికెట్ తనకు కావాలంటూ కాంగ్రెసు నేత రేణుకా చౌదరి పట్టుబట్టి కూర్చున్నారు. 

తెలంగాణలోని 17 లోకసభ స్థానాల్లో 16 లోకసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెసు అధిష్టానం ఖమ్మం స్థానాన్ని మాత్రం పెండింగులో పెట్టింది. దీంతో కాంగ్రెసు నుంచి రేణుకా చౌదరికి ఖమ్మం లోకసభ టికెట్ దక్కవచ్చునని భావిస్తున్నారు.