మొదటి విడత  లోక్ సభఎన్నికలకు సోమవారంతో నామినేషన్లు గడువు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో చివరిరోజు అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్ల నుండి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నల్గొండ జిల్లాలో కాస్సేపు గందరగోళం చోటుచేసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్గొండ అభ్యర్ధి వేమిరెడ్డ నరసింహారెడ్డి నామినేషన్ కు సిద్దమవగా పార్టీ  భీపామ్ మిస్సయింది. దీంతో కాస్సేపు గందరగోళం నెలకొనగా చివరకు ఈ భీపామ్ తో పాటు నామమినేషన్ పత్రాలు, సర్టిఫికేట్లతో కూడిన బ్యాగ్ పోలీసులకు దొరకడంతో గందరగోళాని  తెరపడింది.

అసలేం జరిగిందంటే...  నల్గొండ అభ్యర్థి నరసింహరెడ్డి వద్ద పనిచేసే వెంకటేశ్వర రావు నామినేషన్ పత్రాలు, భీఫామ్, సర్టిఫికెట్లతో కూడిన ఓ బ్యాగ్ ను తీసుకుని బైక్ పై బయలుదేరాడు. నామినేషన్ వేయడానికి చివరి రోజు కావడంతో అతడు హడావుడిగా బ్యాగుని బైక్ వెనకాల తగిలించి వేగంగా వెళుతున్నాడు. ఈ క్రమంలో కాచీగూడ  చౌరస్తా వద్ద కుదుపులకు బ్యాగ్ కిందపడిపోయింది. దీన్ని గమనించకుండా అతడు అలాగే ముందుకు వెళ్లిపోయాడు.

అయితే దీన్ని వెనుకవైపు నుండి వస్తున్న హోంగార్డు వెంకటరమణ గుర్తించి ఆ బ్యాగును తీసుకున్నాడు. దాన్ని తెరిచి చూడగా నరసింహారెడ్డి నామినేషన్ కు సంబంధించిన  పత్రాలు కనిపించాయి. దీంతో వాటిని తీసుకుని నేరుగా డిజిపి కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించాడు. అక్కడి సిబ్బంది వెంకటరమణకు సమాచారం అందించడంతో అతడు అక్కడికి వచ్చా ఆ బ్యాగ్ ను తీసుకుని నల్గొండకు బయలుదేరాడు. ఇలా నామినేషన్ పత్రాలు మిస్సవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.  

చివరకు భీఫామ్, నామినేషన్ పత్రాలు అనుకున్న సమయానికి అభ్యర్ధి వేమిరెడ్డి వద్దకు చేరుకున్నాయి. దీంతో ఆయన ఎలాంటి ఆటంకం లేకుండా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.