ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. తాజా ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించిన పొంగులేటికి ముఖ్యమంత్రి కేసీఆర్ షాకిచ్చారు. ఆయనకు బదులుగా కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్‌లో చేరిన నామా నాగేశ్వరరావును అభ్యర్థిగా ఖరారు చేశారు.

ఈ క్రమంలో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన తర్వాత ఆదివారం ఆయన ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటిని పలువురు అనుచరులు, కార్యకర్తలు కలిశారు. అన్యాయం జరిగిందంటూ శ్రీనివాస్ రెడ్డి వద్ద భోరున విలపించారు. వారిని చూసి ఎంపీ కూడా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని నామినేషన్ దాఖలు చేయాలని కోరారు.