తెలంగాణ ప్రజలు 16మంది టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే....వారికి మరో 100మంది జతకానున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. ఇలా 116 మందితో దేశ రాజకీయాల్లో ఫెడరల్ ప్రధాన పాత్ర పోషించనుందని అన్నారు. ఆ దిశగా కేసీఆర్ వివిధ రాజకీయ పక్షాలతో ఇదివరకే చర్చలు జరిపినట్లు గుర్తుచేశారు.  ఆయన రాజకీయ అనుభవం, కమిట్ మెంట్, ఇతర పార్టీలతో ఉన్న సంబంధాలు ఈ లక్ష్య సాధనకు ఉపయోగపడతాయని కవిత తెలిపారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తెలంగాణ అభివృద్దే కాదు దేశాభివృద్ధి కూడా మన కేసీఆర్ వల్లే సాధ్యమన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తుందని...అందుకు సొంత రాష్ట్ర ప్రజల నిర్ణయమే ముఖ్యమైందన్నారు.  అందువల్ల పూర్తిగా రాష్ట్రంలోని 16 లోక్ సభ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపిస్తే కేసీఆర్ కు కేంద్ర రాజకీయాల్లో కొండత బలం వస్తుందని కవిత పేర్కొన్నారు.  

భారతదేశ సమాజమంతా కెసిఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని కవిత తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కెసిఆర్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని  వివరించారు. 
 
కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని మన అందరికీ తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ఇకబిజెపి అంటేనే మందిర్ వివాదం గుర్తుకు వస్తుందన్నారు. ఈ రెండు పార్టీల నుంచి దేశంను బయటపడేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని అనుకుంటున్నారని కవిత వివరించారు.

కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. పెన్షన్లకు ఇస్తున్న ఒక వెయ్యి రూపాయలలో కేంద్రమే 800 ఇస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కానీ వాస్తవానికి కేంద్రం ఇచ్చేదియ కేవలం 200 రూపాయలు మాత్రమే అన్నారు.మే నెల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్లు అందుతాయని చెప్పారు.  రెండేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించాలని లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తామని ఎంపీ తెలిపారు.

 టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ... ఆ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఢిల్లీలో ఏం చేస్తారని కాంగ్రెస్, బిజెపి నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణను సాధించిన విషయాన్ని వారికి గుర్తు చేయాలన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్  లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఆ రెండు పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఆ మెసేజ్ ల పట్ల, ఆ అసత్య ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

 మన ముఖ్యమంత్రి  ప్రజల ఆత్మ బంధువు అని చెప్పారు. మనందరి బాగోగులు ఆయన చూసుకుంటారని అన్నారు. ఐదేళ్లుగా అభివృద్ధిలో భాగస్వామి అవుతూ మీతో నడిచిన నన్ను మళ్లీ గెలిపించాలని ఎంపీ కవిత కోరారు.

ఈ రోడ్ షో లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , జడ్పీ వైస్ చైర్ పర్సన్ సుమనా రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గడ్డం ఆనంద్ రెడ్డి, ఈగ గంగారెడ్డి, బాజిరెడ్డి జగన్, ఎంపిపి మంజుల, స్థానిక నాయకులు పాల్గొన్నారు.