హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయమన్నారు తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పార్టీని నడపడం చేతకాక టీఆర్ఎస్ పై పడి కాంగ్రెస్ ఏడుస్తోందని విమర్శించారు. 

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు దద్ధమ్మల్లా మారారని విమర్శించారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం అయ్యిందని చెప్పుకొచ్చారు. మరోవైపు బీజేపీపైనా తీవ్ర విమర్శలు చేశారు. మతాన్ని నమ్ముకుని, అమ్ముకుని ఓట్లడిగే పార్టీ బీజేపీ అంటూ విరుచుకుపడ్డారు. దేశానికి బీజేపీ చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. 

తెలుగు రాష్ట్రాల ప్రజలు బీజేపీని, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రెండు ఎంపీ సీట్లతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 16 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే కేంద్రం మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు తీసుకువస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.