లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీపై ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రచార సభలో పాల్గొన్న అక్బరుద్దీన్ ప్రసంగిస్తూ... భారతదేశం ఓ ప్రధానిని కోరుకుంటుందని, చౌకీదార్లు, పకోడీవాలాలను కాదని మండిపడ్డారు.

తాను ట్విట్టర్‌లో చౌకీదార్ నరేంద్రమోడీ అని చూశానని ఆయనకు చౌకీదార్‌గా ఉండాలని అంత ఇష్టంగా ఉంటే... తన దగ్గరకు వస్తే తాను ఆయనకు చౌకీదార్ క్యాప్, ఓ విజిల్ ఇస్తానని అక్బరుద్దీన్  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అంతేకాకుండా ప్రధాని తన ఆధార్, పాస్‌పోర్ట్‌లో కూడా ఆ పేరు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్న ‘‘చౌకీదార్’’ క్యాంపెయిన్‌కు సంబంధించి.. తొలుత ప్రధానిని తనను ‘‘చౌకీదార్’’( దేశానికి కాపలాదారుగా అభివర్ణించుకున్నారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. రాహుల్ చౌకీదార్ కాదని... చోర్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాహుల్‌కు కౌంటర్‌గా ప్రధాని ‘‘మై భీ చౌకీదార్’’ నంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు.

ట్విట్టర్ ఖాతాలో తన పేరుకు ముందు చౌకీదార్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. ప్రధానికి మద్ధతుగా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ట్విట్టర్ ఖాతాలకు ముందు ‘‘మై భీ చౌకీదార్’’ ట్యాగ్‌ను చేర్చారు. దీంతో మీ పిల్లలను డాక్టర్లును చేస్తారా లేక కాపలాదారులను చేస్తారా అంటూ బీజేపీని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి.