తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాను మహబూబాబాద్ నియోజకవర్గం నుండి రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది పనులు, ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్న నమ్మకంతో వున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులను చూసి కాకుండా ముఖ్యమంత్రిని చూసి మాత్రమే ఓటేశారని...అందువల్ల 16 సీట్లు తామే గెలుచుకోనున్నట్లు కవిత తెలిపారు. 

గురువారం మహబూబాబాద్ లోక్ సభ పరిధిలో జరిగిన పోలింగ్ సరళి గురించి కవిత ఇవాళ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తన గెలుపు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్​ నేతలు పూర్తి స్థాయిలో శ్రమించారని పేర్కొన్నారు. పార్టీకి చెందిన సర్పంచ్​లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు సైనికుల్లా శ్రమించారని వారందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని స్పష్టం చేశారు. వారు ప్రతి ఓటరును కలిసి అభ్యర్థించి తనకు ఓటేసేలా చేశారని వారి సేవ మరువలేనిదని ప్రశంసించారు. 

ఇలా నాయకులు, కార్యకర్తల శ్రమ ఫలితంగానే 69.7 శాతం పోలింగ్​ శాతం నమోదయ్యిందన్నారు. అందులో పెద్ద ఎత్తున ఓట్లు టీఆర్ఎస్​ పార్టీకి పడ్డటంతో గెలుపుపై ధీమాతో వున్నట్లు తెలిపారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని  దాదాపు  14 లక్షల మంది ఓటరలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని కవిత తెలిపారు. 

వరికోతల్లో నిమగ్నమైన రైతులు, రైతు కూలీలతో పాటు ఇతర పనులకు వెళ్లిన వారు సైతం కొంత సమయాన్ని పోలింగ్ కేటాయించి ఓటేయడానికి రావడం శుభసూచకమన్నారు. వారంతా ఏకపక్షంగా తనకు ఓటు వేశారని పేర్కొన్నారు. అందువల్ల మహబూబాబాద్ లో టీఆర్ఎస్  2 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలువనుందని... ఇందులో సందేహం లేదని కవిత ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 16 సీట్లు టీఆర్ఎస్​ పార్టీ గెలుచుకుని దేశంలో క్రీయాశీలకంగా మారతామని... దీంతో భవిష్యత్ లో  కేసీఆర్​ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం అవసరం లేదని కవిత పేర్కొన్నారు. 

 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నిటికి  అమలు చేస్తామని స్పష్టం చేశారు. పోడుభూముల సమస్య, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సమ్మక్క సారాలమ్మ జాతరకు జాతీయ హోదా, ఇల్లందులోని బస్సు, రైల్వే స్టేషన్​ సమస్యలు పరిష్కరిస్తామని మరోసారి గుర్తు చేశారు. అలాగే మహబూబాబాద్ ప్రజల ఎన్నో ఏళ్ల నాటి కల మెడికల్​ కాలేజీ ఏర్పాటు చేస్తామని...అందుకోసం ఇప్పటికే సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. 

టీఆర్ఎస్​ పార్టీ ప్రజలకు మేలు చేస్తోందని... దానికి తగినట్లుగా పార్టీ బలోపేతానికి నాయకులుగా తాము కృషి చేస్తామన్నారు. తనకు పునర్జన్మ ఇచ్చిన మహానుబావుడు సీఎం కేసీఆర్​ చల్లగా ఉండి పార్టీ అభివృద్ధి చెందాలని  కోరుకుంటున్నానని అన్నారు. ఇందుకోసం తమ వంతు కృషి చేస్తానని కవిత వెల్లడించారు.