గంభీరావుపేట:కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉంటే రాష్ట్రానికి నిధుల లోటు ఉండదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని ఆయన చెప్పారు.

సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరావుపేటలో ఆదివారం నాడు నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.ఎన్డీఏలో చంద్రబాబునాయుడు  ఆనాడు భాగస్వామిగా ఉన్నందునే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చిందని కేటీఆర్ చెప్పారు.  కేంద్రంలో టీఆర్ఎస్‌ ఎంపీ చక్రం తిప్పే పరిస్థితి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా  వస్తోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

జాతీయ పార్టీల పాలనలో  అబివృద్ధి చెందుతున్న దేశంగానే ఇండియా ఉందన్నారు. 70 ఏళ్ల పాటు కాంగ్రెస్, బీజేపీలు పాలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడు మాసాల క్రితమే తమ ప్రభుత్వం చేసిన  పనులను చూసి మరోసారి తమకు అప్పగించారని ఆయన గుర్తు చేశారు.టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని ఆయన కోరారు.

మిడ్ మానేరు ప్రాజెక్టును  కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టిందని  కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను   దేశంలోని అన్ని రాష్ట్రాలు కాపీ కొట్టాయని ఆయన గుర్తు చేశారు. జైజవాన్, జైకిసాన్ అనేవి నినాదాలకు మాత్రమే పరిమితమయ్యాయని కేటీఆర్ చెప్పారు.