టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు.. ఆయన పార్టీ నేతలకే చిక్కులు తెచ్చిపెట్టాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇటీవల పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

ఆ అభ్యర్థులపై కేటీఆర్ సెటైర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని నాణేం పార్లమెంటు ఎన్నికల్లో చెల్లుతుందా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన నాయకులకే ఇప్పుడు ఎంపీ టికెట్లు ఇస్తోందంటూ కాంగ్రెస్ ను విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంక్షోభంలో పడిపోయిందని, అదను చూసి దెబ్బకొట్టాల్సిన సమయం ఇదేనంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ మీద వేసి సెటైర్లు బాగానే పేలాయి. కానీ.. అదే చెల్లని నాణేం కాన్సెప్ట్.. టీఆర్ఎస్ పార్టీకి కూడా వర్తిస్తుందన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోవడమే ఇప్పుడు చిక్కుల్లో పడేసింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఉన్నారు. మరి అలాంటి వారు టీఆర్ఎస్ జాబితాలో లేరా అంటే.. ఉన్నారు అన్నదే సమాధానం.

ఎవరిదాకానో ఎందుకు.. నామా నాగేశ్వరరావు ఇటీవల టీఆర్ఎస్ లో  చేరారు. ఆయన పార్టీలో చేరిన కేవలం నాలుగు గంటల్లోనే ఆయనను అభ్యర్థిగా ఖరారు చేశారు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నామా.. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినవాడే కదా. మరి ఆయనకు టీఆర్ఎస్ చెల్లని నాణేంలా కనిపంచలేదా అనే విమర్శలు వినపడుతున్నాయి.

నామా ఒక్కడే కాదు.. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పెద్దపల్లి వెంకటేష్ ని టీఆర్ఎస్ లో చేర్చుకొని మరీ ఆయన టికెట్ ఖరారు చేశారు. దీంతో.. టీఆర్ఎస్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా.. టికెట్లు దక్కించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలౌతున్నారని అర్థమౌతోంది.