హైదరాబాద్: తన బావ హరీష్ రావును పక్కన పెట్టి, తెలంగాణ లోకసభ ఎన్నికల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిద్ధపడ్డారు. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో ఒక స్థానాన్ని తన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీకి వదిలేసి మిగతా 16 సీట్లను గెలుచుకోవాలనే వ్యూహంతో ఆయన ముందడుగు వేశారు. 

సారు + కారు+ సర్కార్ అనే నినాదాన్ని అందుకుని ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సాధించే 16 స్థానాలు కీలకమని ఓటర్లకు చెబుతూ రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ప్రచారాన్ని హోరెత్తించారు. చివరి కొద్ది రోజులు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె.  చంద్రశేఖర రావు కూడా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. 

శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించడమే కాకుండా కాంగ్రెసు, తెలుగుదేశం ఎమ్మెల్యేలను కూడా దరి చేర్చుకోవడం ద్వారా 16 లోకసభ స్థానాలను కైవసం చేసుకోవాలని కేసిఆర్ ఎత్తుగడ వేశారు. తమకు 16 సీట్లు వస్తాయని కూడా ఆయన ధీమాతో ఉన్నట్లు కనిపించారు. కేటీఆర్ మాటల్లో ఆ విషయం వ్యక్తమైంది. అయితే, పరిస్థితి అంత సజావుగా లేదని తెలుస్తోంది. 

టీఆర్ఎస్ 11 స్థానాలను మాత్రమే గెలుచుకునే అవకాశాలున్నట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి. రెండు స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతుందని భావిస్తున్నారు. కాంగ్రెసుకు రెండు, బిజెపికి ఒక్కటి, మజ్లీస్ ఒక్కటి సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు అంచనాలు వేశారు. ఈ స్థితిలో సారు + కారు+ సర్కార్ ఫలితాన్ని సాధించే స్థితి లేదనే అంచనాకు కేటీఆర్ వచ్చినట్లు భావిస్తున్నారు. 

తాజా పరిణామాలో నేపథ్యంలో కేటీఆర్ వరుసగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ కిశోర్ తో కేటీఆర్ జరిపిన చర్చల వివరాలు తెలియవు గానీ ఆయన తప్పకుండా తెలంగాణ ఎన్నికల గురించే మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. 

కాగా, కేటీఆర్ స్వయంగా కొన్ని సర్వేలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. తాను చేయించిన సర్వేల ఫలితాలను ఆయన ప్రశాంత్ కిశోర్ తో పంచుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు.