నల్లగొండ: లోకసభ ఎన్నికలను మోడీ వర్సెస్ రాహుల్‌గాంధీగా చిత్రీకరించేందుకు చూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఆ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాటలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు మోడీకి, రాహుల్ గాంధీకి మధ్య సమరం మాత్రమేనని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తావన లేకుండా కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు.

మోడీని, రాహుల్ గాంధీని మాత్రమే ఎంచుకోవాల్సిన ఖర్మ దేశ ప్రజలకు పట్టలేదని కేటీఆర్ అన్నారు. ఆ రెండు జాతీయ పార్టీల పొడగిట్టని ప్రాంతీయ పార్టీలు అనేకం ఉన్నాయని, ఆ రెండు పార్టీలు కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని అన్నారు. దేశంలో ఆ రెండు పార్టీలే ఉండాలన్న నాటకాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. 

పుల్వామా ఉగ్రదాడిలో జవాన్లు చనిపోతే మనం వారం రోజులపాటు రాజకీయ కార్యకలాపాలు రద్దు చేసుకున్నామని, కానీ మన ప్రధాని మాత్రం ఉగ్రదాడి జరిగినా యధావిధిగా రాజకీయాలు చేశారని, పుల్వామా దాడి తర్వాత కేసీఆర్ సైనికులకు ఆత్మస్థయిర్యం నూరిపోశారని కేటీఆర్ చెప్పారు. 

ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు సీఎం కేసీఆర్. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తేగలిగితే 16 మంది ఎంపీలు మనవాళ్లే ఉంటే కేంద్రాన్ని శాసించలేమా అని ఆయన అన్నారు. నల్లగొండలో టీఆర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన శనివారం ప్రసంగించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ ఖిల్లా మీద గులాబీ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో మరోసారి కష్టపడితే అఖండ విజయం ఖాయమని ఆయన తెలిపారు. చైతన్యానికి మారు పేరైన నల్లగొండకు కొత్తగా రాజకీయాలు చెప్పాల్సిన పనిలేదన్నారు. 

కాంగ్రెస్‌లో హోష్ లేదు, బీజేపీకి జోష్ లేదని కేటీఆర్ అన్నారు. మొన్నటి దాకా మోడీ హవా దేశమంతా ఉండేదని, మోడీతో దేశంలో ఏదో అద్భుతం జరుగుతుందని అంతా భావించారని, ఎన్డీయే ప్రభుత్వంతో దేశానికి ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. మోడీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుందని అన్నారు. 

మరోవైపు యూపీఏ పరిస్థితి కూడా నానాటికీ దిగజారిపోతోందని కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 44 స్థానాలు మాత్రమే వచ్చాయని, రేపటి ఎన్నికల్లో కూడా యూపీఏకు 100 సీట్లు మించి రావని అన్నారు. ఎన్డీయే, యూపీయే కలిసినా ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ నైరాశ్యంలో కూరుకుపోయిందని, పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ ఉంటే మళ్లీ చావుదెబ్బ తప్పదని వాళ్ల పార్టీ నాయకులే అంటున్నారని కేటీఆర్ అన్నారు. బీజేపీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయిందని, టీడీపీ తట్టాబుట్టా సర్దుకుని అమరావతి పారిపోయిందని కేటీఆర్ అన్నారు.