తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ శోభన కామినేని తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఓటర్ లిస్ట్ లో ఆమె పేరు గల్లంతవడంతో పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఆమె ఓటేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. దీనిపై శోభన ఇప్పటికే ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె కూతురు, మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కూడా దీనిపై ఫైర్ అయ్యారు. 

ఉపాసన ట్విట్టర్ ద్వారా తన తల్లి ఓటు గల్లంతుపై స్పందించారు. '' మా అమ్మ శోభన కామినేని ఇవాళ ఓటు వేయలేకపోయారు. పది రోజుల క్రితమే ఆమె ఓటర్ లిస్ట్ లో తన పేరును చెక్ చేసుకుంటే వుంది. కానీ ఇవాళ చూస్తే డిలేట్ అయినట్లు చూపిస్తోంది. ఆమె ట్యాక్స్ పేయర్. అలాంటి వ్యక్తే ఇప్పుడు లెక్కలో లేకుండా పోయింది. ఆమెను భారత పౌరురాలిగా భావించడం లేదా?'' అంటూ ఉపాసన సీరియస్ గా ట్వీట్ చేశారు. 

చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువు, ఉపాసన తల్లి శోభన విదేశీ పర్యటనలో వున్నప్పటికి కేవలం ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ కు వచ్చారు. కానీ తీరా ఓటేయడానికి పోలింగ్ బూత్ కు వెళితే ఓటర్ లిస్టులో ఆమె పేరు లేకపోవడంతో ఓటు వేయలేకపోయారు. దీనిపై శోభ మాట్లాడుతూ...భారత పౌరురాలిగా ఎన్నికల్లో ఓటేయలేకపోయిన ఈరోజు తన జీవితంలోనే అత్యంత దుర్దినమని అన్నారు. తాను పోలింగ్ బూత్ కు ఓటేయడానికి వెళ్లగా తనపేరు ఓటర్ లిస్టులో లేదంటూ ఓటేయడానికి అధికారులు అనుమతించలేరని తెలిపారు. అయితే గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను నిరభ్యంతరంగా ఓటేశానని...కానీ ఇప్పుడిలా తన ఓటు తొలగించడమేంటని ప్రశ్నించారు. 

తనను ఈ దేశ పౌరురాలిగా భావించడం లేదా? లేదంటే తన ఓటు అంత ముఖ్యమైంది కాదని అనుకుంటున్నారా? అంటూ శోభ ప్రశ్నించారు. ఇలా తన ఓటును తొలగించి నేరం చేశారని...ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించేది లేదని శోభన ఆగ్రహం వ్యక్తం చేశారు.