ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. పార్టీలు అభ్యర్థులకు టికెట్లు కేటాయించాయి. టికెట్ దక్కిన అభ్యర్థులంతా తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నామినేషన్ లో సదరు అభ్యర్థి ఆస్తి, అప్పులు తదితర వివరాలను పొందుపరచాలి అన్న విషయం తెలసిందే. అయితే.. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆస్తుల విషయంలో తెలంగాణలో రూ.895 కోట్లతో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అగ్ర స్థానంలో ఉంటే.. రూ.650 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పి.నారాయణ టాప్‌లో నిలిచారు. 

వైసీపీ అధినేత జగన్‌ ఆస్తులు రూ.339 కోట్లు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు వాటితోపాటు తమ ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. 

వాటిలో తమ ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నారు. వాటి ప్రకారం.. నరసాపురం వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఆస్తులు రూ.324 కోట్లు కాగా గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ ఆస్తులు రూ.266 కోట్లు. విశాఖలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌కు రూ.200 కోట్ల ఆస్తులున్నాయి.

కాంగ్రెస్ పార్టీ తరపున చేవెళ్ల ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి అత్యంత ధనవంతుడు. తనకు రూ.895కోట్ల ఆస్తులు ఉన్నాయని అందులో చరాస్తులు రూ.856కోట్లు అని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అత్యధిక ఆస్తులు ఈయనకు ఉండగా.. అతి తక్కువగా టీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి పొతుగంటి రాములు మొత్తం ఆస్తుల విలువ 30 లక్షలే. 

తన భార్య భాగ్యలక్ష్మీ పేరిట రూ.8.98 లక్షలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. చేతిలో నగదు కేవలం రూ.3 లక్షలే ఉన్నాయని, భార్య చేతిలో మరో లక్ష ఉన్నట్లు రాములు వెల్లడించారు.