హైదరాబాద్‌: చేవెళ్ల లోకసభ స్థానంలో తన ఓటమికి కాంగ్రెసు అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావును నిందించారు. పోలీసులతోపాటు ప్రభుత్వ యంత్రాంగన్నంతటినీ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్‌ దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. 

తప్పుడు కేసులు, అరెస్టులతో తన కాళ్లు, చేతులు కట్టేసి చేవేళ్లలో గెలిచారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని లక్ష్యం చేసుకున్నట్లే లోక్‌సభ ఎన్నికల్లో అయ్యా, కొడుకు కుట్ర చేసి తనను ఓడించారని ఆరోపించారు. ఇందుకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నంతోపాటు చిన్నాచితకా కాంగ్రెస్‌ నేతలందరినీ కొనుగోలు చేశారని అన్నారు. 

గాంధీభవన్‌లో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు సందర్భంలోనూ పోలీసులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. కేసీఆర్‌ను ప్రశ్నించినప్పుడే తాను గెలిచానని, ఇప్పుడు కూడా నైతిక విజయం తనదేనని ఆయన అన్నారు.