కరీంనగర్: కేసీఆర్ అంటే చంద్రబాబుకు భయం పట్టుకొందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.దేశ రాజకీయాల్లో మార్పుకు తాను పూనుకొంటానని ఆయన తెలిపారు. అవసరమైతే తాను జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు.

కరీంనగర్ జిల్లా నుండి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఏపీలో తనను ఓడించే విషయంలో కర్త, కర్మ అంటూ చంద్రబాబునాయుడు తనను మూడువేల సార్లు తిడుతున్నాడని కేసీఆర్ విమర్శించారు. 

దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన చెప్పారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ వేదికగానే ఈ విషయాన్ని ప్రకటించాలని భావించి ఇక్కడనే ఈ విషయాన్ని ప్రకటిస్తానని కేసీఆర్ తేల్చి చెప్పారు. 

దేశ రాజకీయాల్లో తెలంగాణ పెద్ద పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ మన శక్తి 16 ఎంపీలు కాదన్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణను ఎలా సాధించామో, 16 మంది ఎంపీలతో వంద నుండి 150 ఎంపీలను కూడగట్టి దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తానని ఆయన తెలిపారు. 

16 ఎంపీ సీట్లు ఇస్తే ఏం చేస్తావు కేసీఆర్ అని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. 16 ఎంపీలు కాదు... తన వెనుక సుమారు 100కు పైగా ఎంపీలను కూడగట్టినట్టుగా కేసీఆర్ చెప్పారు.20 ఏళ్ల క్రితం తెలంగాణ తెస్తానని తాను చెబితే ఇలానే తనను అవహేళన చేశారని చెప్పారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావడం కోసం తాను నడుం కట్టినట్టుగా చెప్పారు.

20 ఏళ్ల క్రితం ఇదే గడ్డపై తెలంగాణ తెస్తానని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటలపాటు విద్యుత్ ను ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు  ప్రజల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఐదేళ్ల కింద తెలంగాణ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను ఐదేళ్లలో దేశంలోనే అభివృద్దిలో ముందుందని చెప్పారు.

కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై మరోకరు పరస్పరం విమర్శలు గుప్పించుకొంటున్నారన్నారు.  దేశం బాగుపడాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశం నుండి విముక్తి కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

అంతర్జాతీయ వ్యవహరాలను ప్రధాని మోడీ చక్కబెట్టడన్నారు. ఎన్నికలు రాగానే హిందూత్వాన్ని తెరమీదికి తీసుకొస్తున్నారన్నారు. తాను హిందువు కాదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో తన కంటే ఎక్కువగా యాగాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.