Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డికి చిక్కులే: నల్లగొండ నుంచి కేసీఆర్ పోటీ

మెదక్ లోకసభ స్థానం నుంచి ప్రభాకర్ రెడ్డిని తిరిగి గెలిపించాలని కేసీఆర్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. దీంతో కేసీఆర్ నల్లగొండ స్థానం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు.

KCR may contest from Nalgonda in LS elections
Author
Nalgonda, First Published Mar 5, 2019, 4:18 PM IST

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు నల్లగొండ లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేస్తారని ఆయన తనయుడు కేటీ రామారావు ఆ మధ్య ప్రకటించారు. 

అదే సమయంలో మెదక్ లోకసభ స్థానం నుంచి ప్రభాకర్ రెడ్డిని తిరిగి గెలిపించాలని కేసీఆర్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. దీంతో కేసీఆర్ నల్లగొండ స్థానం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. నల్లగొండ నుంచి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెసు తరఫున లోకసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. నల్లగొండ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరోసారి తిరుగులేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. 

గతంలో కేసీఆర్ మూడు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ లోకసభ స్థానాలకు ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించారు. తొలిసారి 2004లో కరీంనగర్ నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2008ల్లో కూడా ఆయన కరీంనగర్ నుంచి విజయం సాధించారు. 

2014లో గజ్వెల్ శాసనసభ స్థానం నుంచే కాకుండా మెదక్ లోకసభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేశారు. ఆ తర్వాత లోకసభ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి మెదక్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో ఒక్క స్థానాన్ని మజ్లీస్ కు వదిలేసి మిగతా 16 స్థానాలను గెలుచుకోవడానికి అవసరమైన ప్రణాళికను కేసీఆర్ రూపొందిస్తున్నారు. 2014 ఎన్నికల్లో నల్లగొండ నుంచి కాంగ్రెసు నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లోకసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 

గుత్తా సుఖేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. తద్వారా నల్లగొండ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయడానికి వీలు కలుగుతుందని అంటున్నారు. అయితే, నల్లగొండ నుంచి పోటీ చేసే విషయంలో కేసీఆర్ ఇప్పటి వరకు కచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదని పార్టీ వర్గాలంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios