హైదరాబాద్ : హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం తలపెట్టిన ఎన్నికల ప్రచార సభకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత గైర్హాజరయ్యారు. మిర్యాలగుడా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అనంతరం ఆయన హైదరాబాదు తిరిగి వచ్చారు. 

ఆయన అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం బహిరంగ సభకు రావాల్సి ఉంది. అయితే, సభకు రాకుండా విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. మల్కాజిగిరి, సికింద్రాబాదు, చేవెళ్ల లోకసభ నియోజకవర్గాలకు సంబంధించిన సభ అది.

ఎల్బీ స్టేడియం సభకు కేసీఆర్ హాజరు కాకపోవడానికి సరైన కారణమేమిటనేది తెలియడం లేదు. జనం పెద్గగా లేరనే విషయాన్ని నిఘా విభాగం అధికారులు చెప్పారని, దాంతో ఆయన సభకు రాలేదని ఓ వాదన ఉంది. 

కేసీఆర్ రాకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో సభ జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. జనసమీకరణ చేయకపోవడంపై కేసీఆర్ జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే, మిర్యాలగూడా బహిరంగ సభ నుంచి కేసీఆర్ తిరిగి రావడంలో చాలా జాప్యం జరిగింది. ఎల్బీ స్టేడియానికి వచ్చిన ప్రజలు క్రమంగా వెళ్లివోవడం కూడా ప్రారంభించారు. ఈ తీవ్రమైన ఎండ ప్రభావం కూడా పడింది. దీంతో కేసీఆర్ ఎల్బీ స్టేడియం బహిరంగ సభకు రాలేదని అంటున్నారు.