లోకసభ ఎన్నికల్లో షాక్: కేసీఆర్ తో ఆరు నెలల తర్వాత హరీష్ భేటీ
కేటీఆర్ తగిన ఫలితాలు సాధించని నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో హరీష్ రావు కేసీఆర్ తో సమావేశమయ్యారు. హరీష్‌తో పాటు కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సమావేశం జరుగుతోంది.
హైదరాబాద్: లోకసభ ఎన్నికల్లో షాక్ తగిలిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుతో సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావు సమావేశమయ్యారు. ఆరు నెలల తర్వాత హరీష్ రావు కేసీఆర్ ను కలిశారు. తనయుడు కేటీ రామారావుకు పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో హరీష్ రావు లోకసభ ఎన్నికల్లో మెదక్ లోకసభ స్థానానికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.
శాసనసభ్యులు ఎవరు కూడా ఇతరుల నియోజకవర్గాల్లో పర్యటించకూడదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీ రామారావు ఆదేశించారు. దీంతో హరీష్ రావు శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించే బాధ్యతను భుజాన మోశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కేటీఆర్ తగిన ఫలితాలు సాధించని నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో హరీష్ రావు కేసీఆర్ తో సమావేశమయ్యారు. హరీష్‌తో పాటు కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సమావేశం జరుగుతోంది. తెలంగాణలో 16 సీట్లు తమకు వస్తాయనే విశ్వాసంతో ఉన్న కేసీఆర్ కు అనూహ్యమైన దెబ్బ తగిలింది. బిజెపి నాలుగు, కాంగ్రెసు మూడు స్థానాలు గెలుచుకోవడంతో ఆయన గొంతులో పచ్చి వెలక్కాయపడింది.
హరీష్ రావును పక్కన పెట్టడం కూడా అందుకు ఓ కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో తిరిగి హరీష్ రావును దగ్గరకు తీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ సమావేశం జరుగుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కేసీఆర్ ను హరీష్ రావు ఆరునెలలకు పైగా అయ్యింది. నిరుడు డిసెంంబర్11 ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్‌తో హరీష్ భేటీ కావడం గమనార్హం.