మెదక్ : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకి పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూప్రాన్ లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు హరీష్ రావు. సుభాష్ చంద్రబోస్ సర్కిల్ వద్ద  ప్రచార వాహనంపై ఎక్కి ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. 

జనరేటర్‌లో లోపం వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రచారం రథం నుంచి మంటలు రావడంతో హరీష్ రావుతోపాటు ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిలను టీఆర్ఎస్ కార్యకర్తలు కిందకు దించేశారు. 

అనంతరం ఆ వాహనం అగ్నికి ఆహుతైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం చూసి ఒక్కసారిగా షాక్ కు గురైన హరీశ్ అనంతరం అక్కడ నుంచి దిగి వెళ్లిపోయారు.  

ఇకపోతే గతంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలు బాణసంచా కాల్చిన సందర్భంగా అప్పుడు కూడా ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం నుంచి హరీష్ రావు తప్పించుకోగలిగారు. ఇది రెండో ప్రమాదం.