టీఆర్ఎస్ అధిష్టానంపై మాజీ ఎంపీ వివేక్ మండిపడ్డారు. కేసీఆర్ తనను నమ్మించి ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ను ఓడించాలని, ఆ పార్టీకి ఓటేయొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. దీనిని ఆయన అనుచరులు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడిన వివేక్ మనస్తాపంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

గత రెండు రోజులుగా హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. కాగా తాజా లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని వివేక్ అనుచరులకు సూచించారు.

అలాగే ఆయన అనుచరవర్గం నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనూ తిరుగుతూ కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేస్తోంది. మరోవైపు ఏఐసీసీ ముఖ్య నేతలు వివేక్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా పెద్దపల్లిలో వివేక్‌ మద్ధతును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నేరుగా కాకుండా టీఆర్ఎస్‌ను ఓడించాలని ఆయన తన అనుచరులకు ఇచ్చిన పిలుపు ప్రభావం ఎలా ఉంటుంది..? కాంగ్రెస్‌కు ఏ మేరకు లాభం చేకూరుస్తుందన్న దానిపై పెద్ద పల్లిలో చర్చ జరుగుతోంది.

‘‘ ప్రియమైన కార్యకర్తలు, మిత్రులారా..? కేసీఆర్ నమ్మకద్రోహం చేసినందుకు టీఆర్ఎస్‌కు ఓటు వేయొద్దు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం కొట్లాడి, పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఈ నియంతృత్వం పాలన భవిష్యత్తు తరాలకు మంచిది కాదు. బానిసత్వం దూరం కావాలంటే టీఆర్ఎస్‌ను ఓడించండి అంటూ వివేక్ వాట్సాప్‌ సందేశం పంపారు.