మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే పాలేరును రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలపాలనుకున్నా.. కానీ రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ గాలి వీస్తే.. ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్‌కు ఓటేసింది.

ఆ ఓట్లు ఏమయ్యాయి.. మురిగిపోయి.. మురికి కాల్వలో కలిసిపోయాయి. అప్పుడు కాంగ్రెస్‌కు ఓటేసిన వారంతా ఇప్పుడు కుమిలిపోతున్నారు. నాడు చేసిన తప్పు మళ్లీ ఇప్పుడు పునరావృతమైతే మిమ్మల్ని కుక్కలు కూడా చూడవు అంటూ వ్యాఖ్యానించారు.

దేశం మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాల వైపు చూస్తుంటే.. ఖమ్మం జిల్లా అందుకు విరుద్ధంగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలతో ఇంతగా ఎప్పుడూ బాధపడలేదని... అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటును మళ్లీ చేయొద్దని ప్రజలకు సూచించారు.