హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. మాజీ హోంశాఖమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈనెల 13న బుధవారం తనయుడు కార్తీక్ రెడ్డితో కలిసి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువాకప్పుకోనున్నట్లు తెలుస్తోంది. చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆమె అలకపాన్పు ఎక్కారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేవేళ్ల పార్లమెంట్ నుంచి తనయుడు కార్తీక్ రెడ్డిని బరిలోకి దించాలని ఆశించారు. 

అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వేశ్వర్ రెడ్డికే టికెట్ కేటాయించే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఆమె పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో చర్చించారు. అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనూ సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. 

అనంతరం నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితతోనూ భేటీ అయ్యారు. దీంతో ఇక సబితా ఇంద్రారెడ్డి పార్టీ వీడతారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నం చేద్దామని సూచించారు. దాంతో శాంతించారు సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో తన తనయుడు కార్తీక్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. 

అందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నో చెప్పడంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బుధవారం తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ సైతం కోరారు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, తనయుడు కార్తీక్ రెడ్డి. 

అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ఆమె బుధవారం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పార్టీ మార్పుపై సబితా ఇంద్రారెడ్డి తమ అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. 

సబితాఇంద్రారెడ్డి  నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అందరం ఆమెవెంటే నడుస్తామని హమీ కూడా ఇచ్చారు. బుధవారం సబిత వెంట కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు చేరనున్నట్లు తెలుస్తోంది.