ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలని టీఆర్ఎస్ నాయకులందరు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. కానీ నూతన రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తూ అభివృద్ది వైపు నడిపిస్తున్న ఆయన ప్రధాని కావాలని యావత్ దేశం కోరుకుంటోందన్నారు. వారి ఆకాంక్ష ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత సాకారమయ్యే అవకాశాలున్నాయని కడియం అభిప్రాయపడ్డారు. 

లోక్ సభ ఎన్నికల తర్వాత ఫెడరల్ ప్రంట్ లోకి వివిధ ప్రాంతీయ పార్టీలను చేరనున్నాయని తెలిపారు. దీని ద్వారా దేశ రాజకీయాల్లో కేసీఆర్ క్రీయాశీలకంగా మారడం ఖాయమన్నారు. ఇప్పుడున్న ఏ జాతీయ పార్టీకి స్వతహాగా అధికారాన్ని చేప్పట్టే స్థాయిలో సీట్లు రావు కాబట్టి ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత మరింత పెరుగుతుందన్నారు. ఈ సమయంలో కేసీఆర్ వంటి సమర్థ నాయకులు ఈ ప్రాంతీయ పార్టీల కూటమి(ఫెడరల్ ప్రంట్) కి నాయకత్వం వహించి దేశ రాజకీయాలను శాసించనున్నారని కడియం వెల్లడించారు.   

మంగళవారం వరంగల్‌లో జరిగిన టీఆర్ఎస్  పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సభ విజయవంతమవడానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలతో పాటు జిల్లా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇందుకోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్, మజ్లీస్ లు కలిసి రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా కేసీఆర్ వంటి నాయకున్ని ప్రధానిగా కోరుకుంటున్నట్లు కడియం తెలిపారు. 

 ఎన్డీఏ, యూపీఏ కూటములు వచ్చే ఎన్నికల్లో చతికిలపడటం ఖాయమన్నారు. దేశ ప్రధానిగా వుండి మోదీ తన ప్రసంగాల్లో దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని  ధ్వజమెత్తారు. తన పదవికి తగ్గట్లు కాస్త  హుందాగా మాట్లాడాతే గౌరవంగా వుంటుందని కడియం సూచించారు.